Minority Welfare budgetary: మైనారిటీలకు భారీగా కేటాయింపులు
మైనారిటీలకు భారీగా కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం గురువారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మైనారిటీ సంక్షేమ శాఖకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ.3002 కోట్లు కేటాయించింది. గతేడాది బీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2200 కోట్లు కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల బడ్జెట్‌ను భారీగా పెంచగా.. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో కోత పెట్టింది. ఇక గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్ కూడా రూ.4365 కోట్ల నుంచి రూ.3969 కోట్లకు తగ్గించింది.
మైనారిటీ సంక్షేమానికి కేటాయింపులు భారీగా జరపడం మైనారిటీలను మభ్యపెట్టడానికే అని బీజేపీ అభివర్ణించింది. తెలంగాణ రాష్ట్రం దివాళా తీస్తున్న తరుణంలో మైనారిటీలను మభ్యపెట్టడాన్ని తమ పార్టీ ఖండిస్తోందని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు అన్నారు. రంజాన్ వేడుకల కోసం ప్రభుత్వం రూ.33 కోట్లు మంజూరు చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం హిందువుల పండుగలకు నయా పైసా ఇవ్వడం లేదని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.