ఎండలు ఎండలే..వర్షాలు వర్షాలే : జిల్లాలకు ఎల్లో అలర్ట్
అలాగే రాగల వారంరోజుల్లో రాష్ట్రమంతటా పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ స్థిరంగా నమోదయ్యే..
ఎండలు ఎండలే..వర్షాలు వర్షాలే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడితే.. చాలా ప్రాంతాల్లో భానుడు అగ్నిగోళాన్ని తలపిస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ వాసులకు కూల్ న్యూస్ చెప్పింది. రానున్న మూడు రోజుల్లో అక్కడక్కడా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదే సమయంలో 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో మంగళవారం (జూన్6) వరకూ వర్షాలు పడతాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తాయని వెల్లడించింది.
అలాగే రాగల వారంరోజుల్లో రాష్ట్రమంతటా పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ స్థిరంగా నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. హైదరాబాద్, పరిసర జిల్లాల్లో నేటి నుండి 38 డిగ్రీల నుండి 41 డిగ్రీల సెంట్రిగ్రేడ్ వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఫ్రిడ్జ్ లో ఉంచిన పానీయాలు కాకుండా.. మట్టికుండల్లో ఉంచిన చల్లటి మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం, పండ్లరసాలను తరచూ తాగుతుండాలని, నీటిశాతం అధికంగా ఉండే కూరగాయలను తీసుకోవాలని సూచించారు.