Fengal Cyclone : తీరం దాటిన ఫెంగల్ తుపాను.. బీభత్సంగా మారిన తీర ప్రాంతం

ఫెంగల్ తుపాను తీరం దాటింది. నిన్న సాయంత్రమే పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Update: 2024-12-01 02:11 GMT

ఫెంగల్ తుపాను తీరం దాటింది. నిన్న సాయంత్రమే పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మహాబలిపురం - కరైకల్ మధ్య తీరం దాటిందని చెప్పారు. ఫెంగల్ తుపాను తీరం దాటడంతో దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో జోరు వానలు పడుతున్నాయి. రేపు కూడా అనేక జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతవరణ శాఖ అధికారుల తెలిపారు. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని కూడా చెప్పారు. తుపాను తీరం దాటటంతో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో తమిళనాడులోని కొన్ని ప్రాంతాలతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

రెండు రోజులు భారీ వర్షాలు...
విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం ఈరోజు, రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు,అన్నమయ్య, కడప, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో పాటు ప్రకాశం, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని తెలిపింది. సోమవారం వరకూ మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు. అనేక పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు పోర్టులలో మూడో ప్రమాద హెచ్చరిక, కృష్ణపట్నం పోర్టులో ఆరో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విమానాలు రద్దు...
ఫెంగల్ తుపాన్ ప్రభావంతో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు ముందుగానే సూచించారు. చెన్నై ఎయిర్ పోర్టును పూర్తిగా మూసివేశారు.చెన్నై విమానాశ్రయానికి రావాల్సిన, వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయంలో వర్షపు నీరు చేరింది. అలాగే రేణిగుంట విమానాశ్రయంవద్ద కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అనేక విమాన సర్వీసులు తిరుపతి ఎయిర్ పోర్టులో రద్దయ్యాయి. తిరుమలలో భారీ వర్షం కురుస్తుండటంతో శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాలను మూసివేశారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఈ తుపాను దెబ్బకు బాగా ఎఫెక్ట్ అయినట్లు కనపడుతుంది. మిగిలిన కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. రైతులు తమ ధాన్యం ఉత్పత్తులను దాచుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.


Tags:    

Similar News